హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను నియమించే అధికారం ప్రధానితో పాటు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత సభ్యులు గల కమిటీకి ఉండాలి కానీ ఆ సంప్రదాయానికి మోదీ స్వస్తి పలకడంతోనే జ్ఞానేశ్ కుమార్ వంటి తొత్తులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియమించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు అనేది ఎంతో విలువైనదని, అలాంటి లక్షల మంది ఓటును ఇష్టం వచ్చినట్లు తొలగిస్తూ రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
